అపురూప శిల్ప కావ్యాలు 'గణపురం కోటగుళ్లు'


 అపురూప శిల్ప కావ్యాలు 'గణపురం కోటగుళ్లు'

- ఎక్కడ లేని విధంగా 22 వరకు ఉప ఆలయాలు

- శిథిలావస్థలో చారిత్రక సంపద

- పట్టించుకోని పాలకులు

- ప్రత్యేక రాష్ట్రంలో కూడా దక్కని ప్రాధాన్యం


చుట్టు పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ శిల్పాల గుసగుసలు. ఆలయ ఆవరణలోకి అడుగిడగానే చరిత్ర లోతుల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. రాజుల కాలంలోకి వెళ్లామా అనే సంశయం ఒకవైపు  కలుగుతుండగానే ఇక్కడి శిల్పాలు మనతో మౌనంగా మాట్లాడడం ప్రారంభిస్తాయి. గున్న ఏనుగుల వరస మనకు స్వాగతం పలుకుతున్న భ్రమ నుండి బయటపడేలోపే అనేక శిల్ప రీతులు మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి.  ఆలయ సమీపంలో తాటిచెట్ల ఆకుల సవ్వడులు ఒకవైపు... పంట పొలాల పైనుంచి వీచే చల్లని గాలులు మరోవైపు.... శత్రు దుర్భుర్యంగా ఆలయం చుట్టూ నిర్మించిన మట్టికట్ట మధ్యలో ఇదొక అపురూప కట్టడం.. ఇక్కడి అద్భుతమైన శిల్పాలు మనలను మంత్రముగ్దులను చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కాకతీయుల కట్టడాల శ్రేణిలో కలికితురాయిగా నిలిచే కట్టడంగా కోటగుళ్లను అభివర్ణించవచ్చు. ఇదొక అద్భుతమైన శిల్ప కావ్యంగా పేర్కొనవచ్చు.

ఆలయ చరిత్ర....

క్రీ.శ. 1199-1260 మధ్య కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు క్రీ.శ. 1213లో ఈ కోటగుళ్లను నిర్మించాడు. గణపురం గ్రామానికి ఈశాన్య దిక్కున ఉన్న మట్టికోటలో ఈ గుళ్లు ఉండడం వల్ల కోటగుళ్లు అనే పేరు వచ్చింది. రామప్ప దేవాలయం నిర్మించిన కాకతీయ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రరెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతిరెడ్డి ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది. 

కోటగుళ్ల సముదాయం చుట్టూ రాతిగోడలతో ప్రాకారం నిర్మించబడింది. ఈ గుళ్లలో గణపేశ్వరాలయం అనే శివాలయం ఆకర్షణీయమైనది. ఇందులో సర్పధారియై ఢమరుకాన్ని వాయిస్తున్న పరమశివుని నిలువెత్తు విగ్రహం చెక్కబడి ఉండడంతో పాటు సభా మండపాలు ప్రధాన ఆకర్షణగా నిర్మించబడ్డాయి. అంతేకాకుండా ఓరుగల్లుపై దాడిచేసిన దేవగిరి మహారాజును కాకతీయ అష్టమ చక్రవర్తి రాణి రుద్రమాదేవి 15 రోజుల యుద్ధంలో ఓడించినందుకు గుర్తుగా గజకేసరిలో సగం మనిషి, సగం సింహం రూపం ఏనుగుమీద స్వారీ చేస్తున్నట్లు గుర్రం తల - సింహం నడుముతో ఏనుగుమీద స్వారీ చేస్తున్నట్లు యుద్ధ విజయ చిహ్నాలు చెక్కబడ్డాయి. ప్రధాన ఆలయానికి ఉత్తరం దిక్కున ప్రధాన ఆలయం నమూనాలో మరో శివాలయం నిర్మించబడినది. దీర్ఘాకృతి శివలింగం నక్షత్రాకార పానఘట్టంపై కొలువై ఉన్నట్లు కనపడడంతో పాటు ఆలయ గర్భగుడి ముఖద్వారంపైన చండిక, త్రిముఖ బ్రహ్మ, పంచముఖ గరుత్మంతుడు, నందీశ్వరుడు, గిరిజా కల్యాణం, మహావిష్ణువు ఉట్టిపడేటట్లు చిత్రీకరించారు. దీని కింద లక్ష్మీదేవి తామర పువ్వుపై  కూర్చోగా రెండు వైపులా ఏనుగులు తొండాలతో సంయుక్తంగా కలశం పట్టుకుని ఉన్న ఈ విగ్రహం కళా నైపుణ్యంతో కాంతులీనుతుంది. ఇంకా ఆలయం చుట్టూ ఏనుగుల వరస, లతలు చూపుకింపుగా చెక్కబడి ఉన్నాయి.

నాట్య మండపం

ప్రధాన ఆలయానికి దక్షిణం దిక్కున సుమారు 60 స్థంభాలు గల మండపం నిర్మించబడి ఉంది. డంగుసున్నం, కరక్కాయ మిశ్రమంతో నిర్మించిన ఈ ఆలయంచుట్టూ కిన్నెర, కింపురుష, మందాకిని శిల్పాలు ఆలయ గోడల మీద జంతు జీవాలు, రాతి స్థంభం, ఇంకా అనేక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.

నిరాదరణకు గురవుతున్న కోటగుళ్లు...

క్రీ.శ. 1323లో ప్రతాపరుద్రుడు మరణించిన తర్వాత ఈ కోటగుళ్ల సముదాయంపై అనేక దాడులు జరిగాయి. 15వ శతాబ్దం చివరలోనూ, 16వ శతాబ్ధం ప్రారంభ కాలంలో మహ్మదీయ రాజుల చేతిలో ఆలయం ఘోరంగా ధ్వంసమైంది. ఇలా కొన్ని వందల ఏళ్లపాటు ఆలన పాలన లేక శిథిలావస్థలోనే కాలం వెళ్లదీసింది. ఇక మన ప్రభుత్వాల కాలంలో కూడా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఆ ఆలయంపై పెద్దగా దృష్టిసారించడం లేదు. తూతూమంత్రంగా నిధులు కేటాయిస్తూ స్వల్ప మరమ్మతులు చేయడం జరిగింది. ఇక పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొంత మేర నిధులు కేటాయించి తవ్వకపు పనులతో పాటు మరమ్మతులు జరిగాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆలయ రూపురేఖలను మార్చినట్లయితే పర్యాటకంగా ఈప్రాంతం ఎంతో అభివృద్ధి చెందనుంది. సమీపంలోనే ఉన్న గణపసముద్రం కూడా ప్రకృతి అందాలతో అలరారుతోంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వేయిస్థంభాల ఆలయం, రామప్ప దేవాలయం, వరంగల్‌ కోట స్థాయిలో ఇక్కడ శిల్ప సంపద కొలువై ఉన్పప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం, ఆలయాల అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించకపోవడంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడం లేదు. గణపేశ్వరాలయం చుట్టూ సుమారు 22 వరకు ఉప ఆలయాల నిర్మాణం చేపట్టారు కాకతీయులు. కాకతీయుల కట్టడాల్లో పెద్దఎత్తున ఇలాంటి ఉప ఆలయాల నిర్మాణం మరెక్కడా జరగలేదు. ఇందులో చాలా వరకు శిథిలమైపోయాయి. మిగిలిన ఉప ఆలయాలు ప్రస్తుతం మనకు దర్శనమిస్తుంటాయి.

ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి...

వరంగల్‌ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని గణపురం శివారులో కోటగుళ్ల సముదాయం నిర్మించబడి ఉంది. ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వస్తుంది. సుప్రసిద్ధ రామప్ప దేవాలయానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. హన్మకొండ నుంచి పరకాల చేరుకోవాలి. పరకాల నుంచి ములుగు రూట్‌లో వెళ్లే బస్సుల్లో గణపురం చేరుకోవచ్చు.

అనేక చరిత్రలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచేవి పురాతన ఆలయాలు, కట్టడాలే. ఒక ప్రదేశంలో మానవుల జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయలను అంచనా వేయడంలో ఆలయాల పాత్ర కీలకం. ఆలయాల ఆవరణలో ఏర్పాటు చేసే శిలా శాసనాలు, శిల్పాలను బట్టి చరిత్రకు ఒక రూపును ఇవ్వడంతో పాటు లోతుగా అధ్యయనం చేయగలం. పురాతన కట్టడాలను, శిల్పాలను రక్షిస్తే రాబోవు తరాలకు ఒక గొప్ప చరిత్రను అందించినట్టే.

- వల్లంపట్ల క్రిష్ణాకర్‌

డెస్కు జర్నలిస్టు

Comments

Post a Comment

Popular posts from this blog

ప్రకృతి గీసిన చిత్రం ఏటూరునాగారం అభయారణ్యం

బాలు లోటును భర్తీచేసేదెవరు