కాళోజి యాదిలో...

=================

చేతిలో కర్రతో నిలువెత్తు రూపం కళ్ల ముందు సహృదయంతో ప్రత్యక్షమైన్ది. ప్రశాంతతో కూడిన తీక్షణమైన చూపు.  ఎన్నో నిర్బంధాలను, రణరంగాలను సిరా చుక్కలతో ఎదుర్కొని అలసిన ఒక యోధుడి నీడన నేను ఒక గంట పాటు గడిపిన క్షణమది.  అదొక అద్భుత అపురూప సందర్భం.. ఒక మహానుభావుడిని కలిసిన సుదినం. తన కలంతో, గళంతో తెలుగు జాతిని చైతన్య వంతం చేసిన గొప్ప కవి చెంతన గడిపిన నాకు ఆ క్షణాలను ఇప్పుడు తలచుకుంటుంటే ఆనంద పరవశమవుతున్నాను. కానీ అప్పుడు నాకు తెలియదు నేనొక కవితా వటవృక్షం ముందు కూర్చొని వున్నానని... 


అది 2000 సంవత్సరం మార్చి నెల. ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకొని నా సొంత ఊరు గణపురం(ములుగు)లో ఖాళీగా ఉంటున్న రోజులవి. మా బాబాయ్, ప్రముఖ కళాకారుడు వల్లంపట్ల నాగేశ్వర్ రావు గారు తన పనులకు సహాయంగా ఉండేందుకు నన్ను హన్మకొండకు రమ్మని పిలుపందించారు. అప్పటికే ఊర్లో వాల్ రైటింగ్స్, బ్యానర్లు రాయడం, ఆయిల్ పెయింటింగ్ చిత్రాలు వేయడంలో ప్రవేశం ఉన్న నేను బాబాయ్ పిలుపుతో ఇంకొంత ఎక్కువ అనుభవం సంపాదించ వచ్చని వరంగల్ బాట పట్టాను. పుట్టినప్పటి నుంచి గణపురంలోనే పెరిగిన నాకు సిటీలో గడపాల్సి రావడం ఒక రకంగా కొత్త జీవితమే అనుకున్నాను. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చిత్రాలు వేయడంతో పాటు, బాబాయికి సంబందించిన ప్రదర్శనలు, సమావేశాల బ్యానర్లు రాయడం లాంటి పనులు చేస్తుండేవాడిని. అప్పటికే రచయితగా, కళాకారుడిగా పేరున్న మా బాబాయ్ నాగేశ్వర్రావు గారికి కాళోజి నారాయణరావు గారితో మంచి అనుబంధం ఉండేది. దీంతో రాకపోకలు కొనసాగుతుండేవి. అనేక సందర్భాలలో బాబాయ్ తన పనుల కోసం బయటకు వెళ్తున్నప్పుడు నన్ను బండిపై తీసుకుని వెళ్లేవారు. ఆలా ఒక రోజు అద్భుతమైన ఘడియ రానేవచ్చింది. ఏదో విషయంపై చర్చించేందుకు కాళోజి గారి ఇంటికి నన్ను బాబాయ్ తీసుకెళ్లారు. నక్కలగుట్టలో కాళోజి గారి నివాసం ఉండేది. అయితే బాబాయ్ గారు నన్ను తీసుకెళ్లే ముందు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకపోవడంతో అది ఎవరి ఇళ్లో అనుకున్నాను. అదొక మహా తత్వవేత్త, అక్షరాలని తూటాల్లా పేల్చిన  అక్షర యోధుడి నివాస ప్రాంతమని ఊహించలేక పోయాను. ముందుగదిలో నేను, బాబాయి కూర్చొని వున్నాము. కొద్దిసేపటికి ఒక ప్రశాంత రూపం మా ముందు ప్రత్యక్షమైంది. అప్పటికి గని నాకు ఎక్కడ ఉన్నామో విషయం అర్ధమైంది. బాబాయ్ కాళోజి గారిని పలుకరించి క్షేమ సమాచారాలు మాట్లాడుతున్నారు. నాకు ఏం మాట్లాడాలో తెలియక నోరు వెళ్ళబెట్టి చూస్తుండిపోయాను. నా వైపు తీక్షణంగా చుసిన కాళోజి గారు ఎవరీ బాబు అని పలుకరించి మాట్లాడారు. సుమారు ఓ గంట పాటు ఏవేవో విషయాలు వారిద్దరూ మాట్లాడుకున్నారు. అప్పటికే వృద్యాప్యంలో ఉన్న కాళోజి గారు మెల్ల మెల్లగా మాట్లాడుతున్నారు. ఆరోగ్యం సహకరిస్తలేనట్లుంది. మాట మంతి అయిన తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరాం. అలా తెలంగాణ జాతి గర్వించదగిన ఒక గొప్ప కవిని కలుసుకోవడం మరచిపోలేని తీపి గుర్తు. ప్రస్తుతం మనందరికీ సెల్ ఫోన్లు అందుబాటులో ఉండడంతో ఎప్పుడంటే అప్పుడు ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నాం గాని అప్పుడు ఇంకా సెల్ ఫోన్లు అందుబాటులో లేనందున కాళోజీ గారితో ఫోటో దిగలేక పోయాను. ఆ క్షణాలను గుర్తు చేసుకుంటే ఒక ఉద్విఘ్నతకు లోనవుతుంటాను గాని కాళోజీ గారితో తన జీవిత అనుభవాల గురించి గాని, ఇంకా ఏదయినా విషయాలను గుబీరించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదే అనిపిస్తుంది.


- వల్లంపట్ల క్రిష్ణాకర్

డెస్క్ జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

అపురూప శిల్ప కావ్యాలు 'గణపురం కోటగుళ్లు'

ప్రకృతి గీసిన చిత్రం ఏటూరునాగారం అభయారణ్యం

బాలు లోటును భర్తీచేసేదెవరు