బాలు లోటును భర్తీచేసేదెవరు

 

బాలు లోటును భర్తీచేసేదెవరు?

- సరికొత్త స్వరంకోసం తెలుగు ప్రజల ఎదురుచూపు

- నేపథ్యం గానంలో మరో చరిత్రను సృష్టించే వీరుడెవరో...


పాటల వటవృక్షం బాలు గారు అనంతలోకాలకు వెళ్లి అభిమానులను శోఖసంద్రంలో  ముంచిపోయారు.  ఆ గానగాంధర్వుడి మరణంతో దక్షిణ భారతదేశ ప్రజలంతా ఇంట్లో మనిషిని దూరం చేసుకున్నంత బాధకు లోనయ్యారు. ఒక్కటా రెండా ఏకంగా 35వేలకు పైగా పాటలు పాడి 40 ఏళ్లకు పైగా సంగీతాభిమానులను ఉర్రూతలూగించిన ఘనాపాటి.  బాలు గారు కేవలం నేపథ్య గానానికే పరిమితం కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా,  మంచి వక్తగా, వ్యాఖ్యాతగా ఉత్తమ శ్రేణి ప్రతిభను కనబరిచారు. తన పాటతో అన్ని భాషల్లో, అన్ని రకాల వయస్సుల వారిని ప్రభావితం చేయగలిగారు. కోట్లాది మంది అభిమానులను, వందలాది మంది శిష్యులను సంపాదించుకున్నారు. తను పలు కార్యక్రమాల్లో  చెప్పే సంగతులు, సంభాషణలు ఎంతో ఆసక్తికరంగా ఉంటూ మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేవి. 

ఘంటసాల లోటును పూడ్చిన బాలు...

అయితే బాలు గారికన్నా ముందు తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయకుడిగా సినీ సంగీత జగత్తును ఏలిన ఘంటసాల గారు ఒక చరిత్ర. తన అద్భుతమైన, గంభీరమైన కంఠంతో శ్రోతలను మంత్రమగ్దులను చేశారు. తెలుగు సినీ సంగీతం ఒక విభిన్న వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి అతను చేసిన కృషి సమాన్యమైనది కాదు. సుమారు 30 ఏళ్ల పాటు పాటల ప్రవాహాన్ని కొనసాగించారు. అప్పటి అగ్రశ్రేణి నటులైన  ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లకు మెజార్టీ పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1951లో వచ్చిన పాతాళభైరవి విజయవంతం కావడంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది.  ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు ఘంటసాల గారు.  మల్లీశ్వరి, దేవదాస్‌, షావుకారు, మాయాబజార్‌, గుండమ్మ కథ, లవకుశ, గుడిగంటలు, మూగమనుసులు, మంచి మనసులు, పాండురంగ మహత్యం, ఆత్మబలం, ఆరాధన, ప్రేమ్‌నగర్‌ లాంటి వందలాది అద్భుతమైన చిత్రాల్లోని పాటలను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేదు.

అనారోగ్యంతో ఘంటసాల గారు మరణించే నాటికే బాలు గారు సినీ ప్రపంచంలో అడుగిడి పాటలు పాడుతూ అప్పుడప్పుడే పేరు సంపాదిస్తున్న తరుణమది. అయితే ఘంటసాల మరణం అప్పటి ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒక గొప్ప గాయకుడిని కోల్పోయిన అభిమానులు ఆయన లోటును ఎవరు భర్తీచేస్తారోనని ఎదురుచూస్తున్న సమయంలో బాలు గారు నేనున్నానంటూ  సినీ ప్రపంచంలో అడుగుపెట్టారు. అయితే ఘంటలసాల గారిని గానీ మరే ఇతర గాయకులను అనుకరించకుండా తనదైన భిన్నమైన శైలితో బాలు గారు అతితక్కువ సమయంలోనే రికార్డులను తిరగరాయడం ప్రారంభించారు. అలా ఏకంగా 35వేలకు పైగా నేపథ్య గీతాలను ఆలపించి రికార్డు సృష్టించారు. అలాగే తన నటనతోపాటు ఇతర అనేక అంశాలతో తెలుగు వారి ఇంటి మనిషిగా బాలు గారు కీర్తిగడించారు. ప్రజల నుంచి ఇంతటి అభిమాన్ని పొంది ఈ జగత్తును బాలు గారు వీడిపోవడంతో కోట్లాది మంది అభిమానులు కంటతడి పెట్టారు. 

బాలు గారి లోటును పూడ్చేదెవరో...?

ఘంటసాల లేని లోటును బాలు గారు తన గానంతో పూడ్చివేసి మనందరిని మైమరింపజేశారు. మరి ప్రస్తుతం బాలు గారి లోటును భర్తీ చేయగల నేపథ్య గాయకుడు ఎవరు అనే ప్రశ్న అభిమానుల నుంచి ఉదయిస్తోంది. సుమారు రెండు మూడు దశాబ్ధాల పాటు ఏకధాటిగా పాటలు పాడుతూ ప్రజలను రంజింపజేయగల ఘనాపాటి రాగలడా? అనే సంశయం అభిమానులకు కలుగుతోంది. ప్రస్తుతం ఎంతో మంది యువ గాయకులు వస్తున్నప్పటికీ ప్రజల మనోఫలకంపై బలమైన ముద్ర వేయలేకపోతున్నారనేది వాస్తవం. మూడు నాలుగేళ్లపాటు కేవలం పదులు, వందల సంఖ్యలో పాటలు పాడి కనుమరుగవుతున్నారే ఎక్కువగా వస్తున్నారు.

ప్రస్తుతం సుధీర్ఘకాలం పాటు ఒక విభిన్నమైన గొంతుకతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకునే గాయకుడి కోసం వేచిచూస్తున్నారు సంగీత అభిమానులు.

- వల్లంపట్ల క్రిష్ణాకర్‌

Comments

Post a Comment

Popular posts from this blog

అపురూప శిల్ప కావ్యాలు 'గణపురం కోటగుళ్లు'

ప్రకృతి గీసిన చిత్రం ఏటూరునాగారం అభయారణ్యం